కోతి కొమ్మచ్చి
- Connected Indian
- May 14, 2020
- 1 min read
పల్లె వాతావరణం- ఆటలు, పాటలు
చిత్రం సేకరణ: రేణుకా రమానంద్

కొమ్మ కొమ్మలపై కోతి కొమ్మచ్చి
కోకిల గొంతెత్తి కుర్రాళ్ళు హోరెత్తి పచ్చని పల్లెల్లో చెట్టు కొమ్మల్లో
ఊరొచ్చిన పిల్లలతో కోతి కొమ్మచ్చి ఊయల ఊగాలో కోతి కొమ్మచ్చి
చల్లని కుండ చెరువులు నిండ చాకలి దరువు చద్దియన్నము
పల్లె చల్లంగుండాలో కోతి కొమ్మచ్చి ఆకలి చావులు ఆగాలో కోతి కొమ్మచ్చి
వాగు వంకల్లో వాన జల్లుల్లో ముసిరిన మబ్బుల్లో మెరిసేటి మువ్వల్లో
పల్లె అందం చూడాలో కోతి కొమ్మచ్చి చెక్కభజనలు చేయాలో కోతి కొమ్మచ్చి
గోచి పెట్టి గోవులు మేపి జారుడు బండలో చేపలు పట్టి వేరుశెనగలకు కారందట్టి కమ్మని పెరుగు మామిడి పచ్చడి అమ్మలు పెట్టే గోరుముద్దలు
జాబిలి దిగివచ్చి కోతి కొమ్మచ్చి ప్రకృతి రుచులే చూడాలో కోతి కొమ్మచ్చి
తొక్కుడుబిళ్ళ తోసే బండి గాలి పటాలు గాల్లో వదిలి
స్వేచ్ఛగా ఎదగాలో కోతి కొమ్మచ్చి చేతిలో కళలుంటే చాలు కోతి కొమ్మచ్చి
ఉగాది పచ్చడి సంక్రాంతి సందడి వినాయక చవితి ఊరేగింపు పీర్ల పండుగ పులి వేశాలు
పల్లె పండుగ చూడాలో కోతి కొమ్మచ్చి సంస్కారం నేర్వాలో కోతి కొమ్మచ్చి
ఎండిన పొలానికి నీరెట్టండి ఎండ్ల బండులకు నారెత్తండి
చెంగు చెంగున లేగదూడలై నిద్దురవీడి పరిగెత్తండి
పల్లెలు.. రైతుల రాజ్యంరో కోతి కొమ్మచ్చి మరి రైతులు.. ఆకలి తీర్చే సైనికులో కోతి కొమ్మచ్చి
- సురేష్ గుండ్లూరి(11-04-2018)
Comments